Telugu Christmas skit script in Telugu

క్రీస్తు జననము

Stage: I

(మరియ గృహము)

మరియ దైవ ప్రార్ధనలో మోకరించి ఉండును 

సృష్టి కర్తవును, సర్వోన్నతుడవును ప్రేమాస్వరూపుడవైన మాదేవా !

నీకు నా కృతజ్ఞతతో నిండిన వందనములు చెల్లించుచున్నాను. నీ ప్రేమనుబట్టి నీ ప్రజలమైన మా కొరకు, మా రక్షణార్ధమై నీవు పంపబోవు మెస్సియ కొరకు ఈ దేశ ప్రజలందరూ ఎదురు చూచుచుండగా ప్రస్తుత రోమా సామ్రాజ్య క్రూరమైన ప్రభుత్వము నుండి మమ్మును రక్షించుటకై మెస్సియను త్వరగా పంపుము. నీ దీవెనలు మా దేశము మీదను మా కుటుంబముల మీదను కుమ్మరించుమని వేడుకొనుచున్నాను దేవా!

(గాబ్రియేలు దూత ప్రవేశము – మరియ భయముతో లేచి నిలచును )

దూత: దయా ప్రాప్తురాలా నీకు శుభము – ప్రభువు నీకు తోడైయున్నాడు 

మరియ: (భయంతో) ఈ శుభవచనం ఏమిటో!

దూత: మరియా భయపడకుము, దేవునివలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరుపెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడన బడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి ఐన దేవుడు, ఆయన తండ్రి ఐన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు యేలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండును. 

మరియ: నేను పురుషుని ఎరుగని దాననే! ఇదేలాగు జరుగును?

దూత: పరిషుద్ధ్హాత్మ నీమీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. 

మరియ: ఇదిగో ప్రభువు దాసురాలను. నీమాట చొప్పున నాకు జరుగును గాక.!

Stage: II

గొర్రెల కాపరులు

(1. అబ్రహాము 2. యాకోబు 3. రూబేను 4. యుదా) 

అబ్రహాము : (స్టేజి మీద అటు ఇటు తిరుగుచూ) (బిగ్గరగా పిలచును )

ఒరే! యాకోబు!…. రుబెనూ!…. యుదా!…. 

చీకటి పడుతోంది కదా, గొర్రెలన్నిటిని దొడ్డిలో చేర్చి రండిరా. మన యెహోవా దేవుని ప్రార్ధించుకుందాం. 

రూబేను ప్రవేశం : అబ్రామన్నా ఆ దేవుని కృపవల్ల ఈరోజంతా మన గొర్రెమందలు చక్కగా పచ్చిక మేసి దొడ్డికి తిరిగి వచ్చాయి 

యూదా ప్రవేశం: మన బలమైన దేవునికి వందనాలు చెప్పాలి. ఈ రోజు నేను, యాకోబు మా మందలను తూర్పు దిక్కు వరకు పోనిచ్చినపుడు.. దూరము నుండి ఒక తోడేలు మంద మీదికి రావడానికి ప్రయత్నించింది. మేము మన దేవుని ప్రార్ధించి ఆయన సహాయంతో దుడ్డు కర్రలతో దానిమీద దాడి చేసి తరిమి వేసాము. 

అబ్రహాము: సరే! మన దేవుడు మనలను కునుకక నిద్రించక కాపాడే దేవుడు కదా! సదా కాలం మనతో ఉంటాడు. ఇలా రండి ఆయనను స్తుతించుకుందాం!

(స్తుతి పాటపాడి నిద్రించుదురు)  

దూత ప్రవేశం: (వెలుగు చూచి అందరూ భయంతో కేకలు వేయుచూ వణకుచు ఉందురు)

దూత: భయపడకుడి, ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన యేసు క్రీస్తు  దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెద రని వారితో చెప్పెను.

గొర్రెల కాపరులు : జరిగిన కార్యమును దేవుడు మనకు తెలియజేసియున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి .. ఆ రక్షకుని చూతము!

(పాట)  

Stage: III

(2 సం. తరువాత తూర్పు దేశపు జ్ఞానులు)

ముగ్గురు జ్ఞానులు ప్రవేశం

1వ జ్ఞాని: స్నేహితులారా చాలా దినములు ప్రయాణంచేసి ఈ స్థలానికి చేరుకున్నాము. ఇచ్చటనుండి ఏ దిక్కునకు పోవలెనో మనము జాగ్రత్తగా గ్రహించవలయును   

2వ జ్ఞాని: అవును… మనలను ఇంతవరకు నడిపించిన నక్షత్రము కొరకు ఎదురు చూడాలంటే మనం చీకటి పడేవరకు ఇక్కడే వేచియుందాం 

3వ జ్ఞాని: సోదరులారా! ఇప్పుడు ప్రయాణం చేయడానికి నాకిక ఓపిక లేదు.. ఎడారులు దాటాం…. కొండలు… నదులు దాటాం – నాకు చాలా అలసటగా ఉంది. సాయంత్రం వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం 

(కొంతసేపు తరువాత )

1వ జ్ఞాని: స్నేహితులారా! లేవండి! చీకటి పడుతోంది అదిగో మనకు ఇంతవరకు దారిచూపిన నక్షత్రం పడమటి దిశగా ప్రయాణించు చున్నది 

2వ జ్ఞాని: అవును! మనం ఆ దిక్కుగా బయలుదేరుదాం… 

3వ జ్ఞాని: ఆ దిశగా బహుశా యూదా దేశం ఉంటుంది. ప్రవక్తయిన “ఇదిగో నక్షత్రము యాకోబులో ఉదయించునని చెప్పాడు. ఆ దేశంలోనే యాకోబు సంతానమైన ఇశ్రాయేలు ప్రజలు నివసించారు. 

1వ జ్ఞాని: అవును సోదరులారా! అక్కడ యెరుషలెము అనే యెహోవా దేవుని ఆలయము ఉన్నదని నేను చరిత్ర గ్రంధాలలో చదివాను 

2వ జ్ఞాని: ఇక ఆలస్యమెందుకు… ముందుకు సాగుదాం, ఒంటెలను సిద్ధపరచండి. 

3వ జ్ఞాని: ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో … నేను బాగా అలసిపోయాను…         

Stage: IV

హేరోదు రాజు భవనం .. రాజు సింహాసనం మీద ఉండును 

మంత్రి: మహా రాజులు… హేరోదు ప్రభువులకు జయము జయము 

మహారాజా! తమ దర్శనం కొరకు తూర్పు దేశాలనుండి ఎవరో ముగ్గురు జ్ఞానులు వచ్చారు 

రాజు: వారిని లోనికి ప్రవేశపెట్టుము 

ముగ్గురు జ్ఞానులు: రాజు చిరంజీవియగును గాక! (దీవెన!)

రాజు: మహా జ్ఞానులారా! మీరు ఈ దేశానికి వచ్చిన సంగతి మేము వినగోరుచున్నాము. వివరముగా చెప్పండి  

1వ జ్ఞాని: మహారాజా! యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ వున్నాడు?

2వ జ్ఞాని: తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి బయలుదేరి వచ్చాము 

3వ జ్ఞాని: యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాదు. ఆయన సర్వలోకమునకు రాజు. మేము ఆయన నక్షత్రమును చూచి బయలుదేరి వచ్చాము 

 (తనలో తాను కలవరంతో కోపంతో) ఔరా! యూదుల రాజుగా నేనుండగా వేరొక రాజు పుట్టెనా!  మరియు అతడు లోకమంతటిని ఏలునా?  

మహా మంత్రి! మన ఆస్థానం లోని పండితులను పిలిపించి.. అతడెక్కడ పుట్టెనో తెలుసుకొనండి  

మంత్రి : చిత్తము ప్రభూ! (కొంత సేపైనా తరువాత పండితుడు వచ్చును)   

పండితుడు: ప్రభూ యూదుల రాజుగా పుట్టబోవువాడు  యుదా బెత్లేహేములో పుట్టునని చాలా కాలం క్రితమే ప్రవక్త ప్రవచించాడు 

(మత్తయి : 2:5 చదవాలి)

 హేరోదు: మహా జ్ఞానులారా! మీ రాక మాకు ఎంతో మేలు! మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే, నేనును వచ్చి ఆయనను పుజించునట్లు నాకు వర్తమానము తెండి. – మరలా మనం కలుసుకుందాం.       

 

Stage: V

మరియ — యోసేపు — బాలుడు — 

1వ జ్ఞాని: యూదుల రాజా! నేను నిన్ను పూజించటానికి తెచ్చిన ఈ బంగారమును అంగీకరించుము. నన్ను దీవించుము 

2వ జ్ఞాని: రాజులకు రాజా! ఈ బోళమును స్వీకరించి, నన్ను ఆశీర్వదించుము 

3వ జ్ఞాని: సర్వలోక రక్షకా! ఈ స్వచ్ఛమైన సాంభ్రాణిని అంగీకరించి నన్ను కరుణించి దీవించుము 

***The End****

Script:   Vanitha  Manukonda

Source: Telugu Christian Resource